© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
YS Jagan Mohan Reddy: 'పురుషోత్తపట్నం నుంచి ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ కాలువలో వదిలి దాన్ని చూపించి పోలవరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాకున్నా ప్రచారం మాత్రం వేరే లెవల్ అని తెలిపారు. నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని నిలదీశారు.
'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ. మీరు మొదలుపెట్టని.. మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే' అని చంద్రబాబు పబ్లిసిటీపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయితే.. ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి అంతా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది' అని వైఎస్ జగన్ విమర్శించారు.
'పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014-19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంలా మారాయి' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యాలు పాటించకుండా.. పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు.
'పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. మీరు చేసిన తప్పులతో.. నిర్వాకాలతో పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైంది. మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం. ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు' అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు సంగతి తేల్చండి. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు అయితే నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు? అని అడిగారు.
'ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?' అని చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 'పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?' అని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిలదీశారు.