© 2026 nimisham.in
ఆ కుటుంబంలో ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది తరాల నుంచి ఆడపిల్లే పుట్టలేదు. ఎన్నో తరాలు పాటు ఎదురుచూసిన ఆ కుటుంబం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
రెండు శతాబ్దాల తర్వాత అమ్మాయి పుట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోయారు. మేళతాళలతో రథంపై ఊరేగించి ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాలో పార్లీ వైద్యనాథ్‌కు చెందిన లింబాజీ దహిపాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఆడపిల్లే లేదు.లింబాజీ కుమారుడు హృషికేష్ భార్య ఆగస్టు 24న ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ చిన్నారికి ‘గార్గి’ అని పేరు పెట్టిన కుటుంబం.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు రథంపై ఊరేగించి, పూలవర్షం కురిపించి, మేళతాళాలు, డ్యాన్సులతో ఘనస్వాగతం పలికారు. దీనిపై లింబాజీ మాట్లాడుతూ.. ఆడపిల్ల కోసం 200 ఏళ్లుగా తమ కుటుంబం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు మా ప్రార్థనలు ఫలించి మహాలక్ష్మి కరుణించి, తమ నట్టింట అడుగుపెట్టిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘కుటుంబంలో కూతురు ఉండటం గొప్ప అదృష్టం. ఎన్నో ఏళ్లుగా మాకు కూతురు లేదనే బాధ ఉండేది.. ఈరోజు ఆ లోటు తీరింది’ అన్నారు.అలాగే, తన ఇద్దరు కోడళ్లను సొంత కూతుళ్ళలా చూసుకున్నానని, మేళతాళాలు, డ్యాన్సులతో రథంలో తన మనవరాలిని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని లింబాజీ అన్నారు. ఆసుపత్రిలోనే తమ కుటుంబం ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకుందని లింబాజీ భార్య సురేఖ దహిఫాలే చెప్పారు. ‘‘ఈరోజు లక్ష్మి మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె అన్నారు. చిన్నారి గార్గి తండ్రి హృషికేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘‘ఇన్ని ఏళ్లుగా ముఖ్యంగా రక్షాబంధన్, భాయి దుజ్ వంటి పండుగలప్పుడు కుటుంబంలో ఆడపిల్ల లేని లోటు మాకు తెలిసేది. కొడుకులతో పోలిస్తే కూతుళ్లే తమ తండ్రి పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటారని నేను నమ్ముతాను.. సాధారణంగా ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకుంటారు. కానీ అమ్మాయి పుడితే ఆ అనుభూతి, ఆనందమే వేరు. ఆడపిల్ల ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. నేను నా బిడ్డను ఓ పువ్వులా అపురూపంగా పెంచుతాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. లింబాజీ స్కూల్ ప్రిన్సిపాల్ కాగా.. ఆయన కుమారుడు హృషికేష్ ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు.పార్లీ వైద్యనాథ్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు పద్మశ్రీ ధర్మాధికారి మాట్లాడుతూ.. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన పార్లీ వైద్యనాథ్ పవిత్ర భూమిపై నాలుగు తరాల ఆ కుటుంబం నిరీక్షణ తర్వాత గార్గి జన్మించడం తమకు మిక్కిలి ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ‘దహిఫాలే కుటుంబం ఈ చర్య సాంప్రదాయ లింగ వివక్షను అధిగమించి యావత్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.