© 2026 nimisham.in

Visakhapatnam: మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎమ్మెల్సీ రవిబాబు విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా...
Visakhapatnam: మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎమ్మెల్సీ రవిబాబు
విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆదివాసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయంలోకి నెడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.
మారికవలస గురుకుల పాఠశాల పునరుద్ధరణ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట చెబుతూ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు.
మారికవలస గురుకుల పాఠశాలను కాపాడేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన మరియు పలు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు.
శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు.
ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు
విశాఖపట్నం జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులతో చర్చలు జరిపినప్పటికీ, అసలు సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు అన్నారు.
జీవో నెం.69ను రద్దు చేస్తామనే హామీ ఎక్కడా రాలేదని, మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శాశ్వతంగా యథావిధిగా కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదని ప్రశ్నించారు.
“తల్లిదండ్రులు కోరితే వారి పిల్లలను ఇక్కడ చదివిస్తాం” అని అధికారులు చెప్పడం శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. ఇప్పటికే తల్లిదండ్రుల సమావేశంలో వందలాది మంది తమ పిల్లలు మారికవలస గురుకులంలోనే చదవాలని స్పష్టంగా తీర్మానం చేసినప్పటికీ, మళ్లీ ఒక్కో తల్లిదండ్రి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వక లేఖలు కోరడం ఏమిటని ప్రశ్నించారు.
ఒకరోజు హామీ.. మరుసటి రోజు మాట మార్పు ఎందుకు?
పాడేరు ఐటీడీఏ వద్ద తల్లిదండ్రులతో మాట్లాడిన సందర్భంగా విద్యార్థులను తిరిగి గురుకుల పాఠశాలలోనే చదివిస్తామని అధికారులు చెప్పారని, అయితే అనంతరం మారికవలస ప్రాంగణాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు కేటాయించామని చెప్పడం గందరగోళానికి దారితీసిందని అన్నారు.
ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట మాట్లాడటం ద్వారా ఆదివాసీ బిడ్డలకు మళ్లీ వెన్నుపోటు పొడవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ప్రశ్నించారు.
మారికవలస గురుకులం కేవలం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, భవిష్యత్ ఆదివాసీ తరాలకు సంబంధించిన విలువైన విద్యాసంస్థ అని తెలిపారు.
మూడు జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఈ విద్యాసంస్థను పరిరక్షించడం అత్యవసరమన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే దాని కోసం ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న గురుకుల పాఠశాలను మూసివేయడం లేదా విద్యార్థులను చెదరగొట్టడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను అవసరమైతే వేరే అద్దె భవనంలో తాత్కాలికంగా ప్రారంభించి, తరువాత శాశ్వత మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
“కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికే వందలాది మంది ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న మారికవలస గురుకులాన్ని మూసివేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం” అని స్పష్టం చేశారు.
విద్యార్థుల తరలింపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
విద్యార్థులను అర్ధరాత్రి సమయంలో తరలించిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఎక్కడికి, ఏ పరిస్థితుల్లో తరలించారనే విషయంలో తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని విమర్శించారు.
తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడుతుంటే వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరైన విధానం కాదన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు
1. మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలను యథావిధిగా కొనసాగించాలి.
2. పాఠశాల తరలింపు లేదా రద్దుకు సంబంధించిన జీవో నెం.69ను వెంటనే రద్దు చేయాలి.
3. మారికవలస నుంచి ఇతర ప్రాంతాలకు తరలించిన సుమారు 480 మంది విద్యార్థులను తిరిగి అదే పాఠశాలకు తీసుకురావాలి.
4. గురుకుల పాఠశాలను మూసివేసి ఇతర సంస్థలకు కేటాయించే ప్రయత్నాలను విరమించుకోవాలి.
5. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను వేరే ప్రత్యామ్నాయ భవనంలో ఏర్పాటు చేయాలి.
6. తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చి వ్యక్తిగత లేఖలు తీసుకునే విధానాన్ని నిలిపివేయాలి.
7. ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం ప్రకటించాలి.
“మాకు తాత్కాలిక హామీలు వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి. జీవో నెం.69ను రద్దు చేసి మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు” అని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఈ ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విద్యార్థుల హక్కుల కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
మారికవలస గురుకుల పాఠశాల పూర్తిస్థాయిలో యథావిధిగా కొనసాగుతుందనే స్పష్టమైన ప్రభుత్వ హామీ వచ్చే వరకు, జీవో నెం.69 రద్దు అయ్యే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు స్పష్టం చేశారు.