© 2026 nimisham.in
వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారు
లు తొలగించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు గద్దెను కూడా నేలమట్టం చేశారు.విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట పట్టణంలో బందోబస్తు నిర్వహించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విగ్రహం తొలగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారని.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అనుమతులు లేకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, డాక్టర్ రాజయ్య వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపివేయలేరని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసినందుకే అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో ఆయన చిత్రపటం ముందు సతీమణి పెద్ది స్వప్న రోదిస్తూ, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'నువ్వు లేని రోజు చూడు, ఎంత అరాచకమో.. తట్టుకోలేకపోతున్నా.. ఒక్క రోజులో చూడు ఎంత ఆగమైపోయిందో' అంటూ ఆమె ఏడ్చారు. ఫ్యామిలీ గురించి మాత్రమే కాకుండా ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం తట్టుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.